ఆడబిడ్డ మెచ్చేలా.. మనసు మురిసేలా కార్మికక్షేత్రంలో సద్దుల సారె ముస్తాబవుతున్నది. 10 రంగులు, 19 డిజైన్ల మేళవింపుతో 240 వెరైటీల్లో సింగారించుకుంటున్నది. చెక్స్, లైనింగ్‌తో మెరుగులు, జరీ అంచుల తళుకులతో నేతన్న చేతిలో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 350 కోట్ల విలువైన కోటి చీరల ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి వడివడిగా.. పండుగలా సాగుతున్నది. సాంచాల సప్పుళ్లతో ఇంటింటా ఆనందం వెల్లివిరుస్తున్నది. ఇప్పటికే దాదాపు 80లక్షల చీరల ఉత్పత్తి పూర్తయి ప్రాసెసింగ్ కాగా, ఆ వెంటే చేనేతజౌళీ శాఖ యంత్రాంగం జిల్లాలకు తరలిస్తున్నది. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు మొదలు కానుండగా, ఆలోపే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ చీరలపై మహిళల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, చేతినిండా పని.. పనికి తగ్గ వేతనంతో కార్మికలోకం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏండ్లు నిండిన బీపీఎల్ మహిళలందరికీ ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు, జౌళీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని నేత కార్మికులకే అప్పగిస్తున్నది. ఈ ఏడాది 350 కోట్లు కేటాయించి కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు మొదలు కానుండగా, 15 వరకే లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యం విధించింది. ఇప్పటికే 75 లక్షల చీరల ఉత్పత్తి పూర్తి చేసి జిల్లాలకు తరలిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎప్పట్లాగే ఈసారి చీరల తయారీలో రంగులు, డిజైన్లు, నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆడబిడ్డలు మెచ్చేలా ఈ యేడాది కూడా 10 రంగులు.. 24 డిజైన్లతో కలిపి 240 వెరైటీలతో చీరలను తయారు చేస్తున్నారు. ఆరు గజాలతోపాటు ప్రత్యేకంగా ఎనిమిది గజాల చీరలను నేయిస్తున్నారు. అంచుల డిజైన్ల కోసం ప్రత్యేకంగా ఒక్కో సాంచాకు 30 వేల వరకు ఖర్చు చేసి సూరత్, ఇచ్చల్ కంరంజీ, భీవండీ నుంచి డాబీలను తెప్పించారు. చీరలకు రెండు వైపులా జరీ అంచులు పోసి కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు. ఏటా మార్పులు, చేర్పులు చేస్తూ తమ కళా నైపుణ్యం ఉట్టి పడేలా తయారు చేస్తున్నారు. అలాగే, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం చీరల తయారీలో ఎక్కడా రాజీ పడకుండా సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నారు. నాణ్యతను పరిశీలించేందుకు చేనేత జౌళీ శాఖకు చెందిన 50 మంది సిబ్బందిని కేటాయించారు. వీరు క్వాలిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాణ్యత లేని వస్ర్తాలను పక్కన పెడుతున్నారు.
గత జనవరిలో బతుకమ్మ చీరల ఆర్డర్‌ను రాష్ట్ర సర్కారు ఇచ్చింది. కోటి చీరలకు సంబంధించి 6.3 కోట్ల మీటర్ల వస్ర్తాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఆర్డర్ వచ్చిన తర్వాతి నుంచే ఉత్పత్తి ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు మొత్తం తయారీ పూర్తి కావాల్సి ఉండగా, దాదాపు 10 వేల సాంచాలపై ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటి వరకు 4.5 కోట్ల మీటర్ల వస్త్రం (75 లక్షల చీరలు) తయారు చేశారు. పండుగ సమీపిస్తున్నందున చీరల ప్రొడక్షన్లో మరింత వేగం పెంచారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15 వేల మంది కార్మికులు రాత్‌పైలీ, దిన్పైలీ పనిచేస్తున్నారు. రోజుకు 3.5 లక్షల మీటర్ల వస్త్రం (58 వేల చీరలు) ఉత్పత్తి చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని సాంచాలపై తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
బతుకమ్మ చీరల తయారీతో సిరిసిల్లలో రోజూ పండగలాగే ఉంది. కామ్గార్లు రాత్‌పైలీ, దిన్పైలీ నడుపుతున్నరు. ఎక్కడ చూసినా సాంచాల సప్పుడే వినిపిస్తంది. చీరలను తీసుకెళ్లే అటోలు, భీములు నింపేటోళ్లతో ఎప్పుడు సందడే ఉంటంది. ఎవరు కూడా వట్టిగుంట లేరు. అందరు పనిలో ఉన్నరంటే కేటీఆర్ సార్ దయవల్లనే. ఆయన జెయ్యవంటే సిరిసిల్ల సాంచాలకు సావులేకుంటున్నది.
– అల్లె దివ్య సిరిసిల్ల, కార్మికురాలు
ఉత్పత్తయిన వస్ర్తాన్ని ఎప్పటికప్పడు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 4.5 కోట్ల మీటర్ల వస్త్రం (75 లక్షల చీరలు) తయారు కాగా, సిరిసిల్లలోని రెండు, హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న తొమ్మిది యూనిట్లకు పంపించారు. ప్రాసెసింగ్ అయిన వెనువెంటే చీరలను ప్యాకింగ్ చేసి జిల్లాలకు తరలించేలా టెస్కో సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. వారం నుంచే తరలిస్తుండగా, సెప్టెంబర్ 15 నాటికి మొత్తం ఈ ప్రక్రియను ముగించనున్నారు. బతుకమ్మ పండుగకు ముందే సెప్టెంబర్ రెండో వారం వరకు తరలింపు పూర్తి చేయనున్నారు.
బతుకమ్మ చీరల తయారీతో వేలాది మందికి చేతినిండా పనిదొరుకుతున్నది. దాదాపు 15 వేల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేత కార్మికులతోపాటు వైపనీ, వార్పిన్ కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆటో కార్మికులు, గుమాస్తాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. ప్రతి నెలా 16 వేల నుంచి 20 వేల వేతనం అందుతుండడంతో నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేండ్లుగా బతుకమ్మ చీరల తయారీతో చేతి నిండా పని కల్పిస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని నేత కార్మికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
బతుకమ్మ చీరలతో మాకు చేతి నిండా పనిదొరికింది. బీడీల పని సరిగా లేక సాంచాలు పెట్టుకున్నం. కేటీఆర్ సార్ జెయ్యవట్టి సాంచాలకు బందనేదే లేదు. మంచిగ పనిజేత్తే నెలకు రూ.15 వేలకు ఎక్కువనే పగారత్తుంది. చాలా మంది మహిళలు బీడీలు బంద్వెట్టి కండెల మిషన్ పనిజేస్తున్రు. బీడీల కన్నా కూలి మంచిగస్తున్నది. మాకు భరోసా ఇచ్చిన రామన్న సారుకు రుణపడి ఉంటం.
– అల్లె పద్మ, కార్మికురాలు (సిరిసిల్ల)