కలెక్టరేట్, ఆగస్టు 26: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేయడం మతోన్మాదులకు చెంపపెట్టు లాంటిదని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధికోసమే ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకే కేసీఆర్ సర్కారు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను అమలు చేసిందని చెప్పారు.
ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. నగరంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న వినోద్, మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత శంకర్ రెడ్డి, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బరత్ అలీ, ఎంఐఎం లీగల్ అడ్వయిజర్, న్యాయవాది, కొండాడి సుధాకర్‌రావు, ఫసి అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.