కమాన్చౌరస్తా, ఆగస్టు 26: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన గణేశ్ నవరాత్రోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ, శాంతి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేశ్ నవరాత్రోత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించి కనెక్షన్ తీసుకోవాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలని, మండపాల వద్ద భక్తిపాటలు పెట్టాలని సూచించారు. మండపం వద్ద ప్లాస్టిక్ వినియోగించవద్దని, తులసీ, రావి లాంటి మొకలను ఏర్పాటు చేయాలన్నారు. మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
గణేశ్ నవరాత్రులు మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి జవేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, పోలీసు, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఆగస్టు 26: ఈనెలాఖరులోగా హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారం లక్ష్యం, ఇప్పటి వరకు నాటిన మొక్కల వివరాలపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశంనిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈసారి 47 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే 40 లక్షల పైచిలుకు నాటినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల్లో లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, అందుకనుగుణంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. ఈసారి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని నిర్ణయించి, అందుకనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
రహదారులకు ఇరువైపులా చెత్తాచెదారంతో పాటు పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని, వాటిని తొలగించి నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాజీవ్ రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.