కొత్తపల్లి, ఆగస్టు 26: లంబాడీ కులస్తులకు ప్రభుత్వం నుంచి మరింత చేయూతనందించి వారి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలోని శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ మేరా మా దుర్గామాత ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్వాగత తోరణం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ, లంబాడీ కులస్తులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉన్నత వర్గాలకు దీటుగా అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు.
రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం నుంచి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి ఎదిగేలా ఉన్నత విద్యనభ్యసించాలన్నారు. సేవాలాల్ మహరాజ్ బంజార బిడ్డ అయినా సమాజ మార్పు కోసం కృషి చేసి అన్ని వర్గాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. శాంతినగర్‌లో బంజార భవన్ నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధుల్లోంచి రూ. 10 లక్షలు కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. సేవాలాల్ గుట్టపై విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.
అనంతరం వినోద్‌కుమార్‌ను బంజార నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్, నాయకులు లక్ష్మీనారాయణ, చాంద్ పాషా, శ్రావణ్‌నాయక్, మోహన్‌నాయక్, భాస్కర్‌నాయక్, విట్టల్నాయక్, ఆలయ కమిటీ సభ్యులు బానోతు రవినాయక్, అజ్మీర రవి నాయక్, వినోద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.