పెద్దపల్లి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లిలో ఈ నెల 29న లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాను ఇచ్చి, బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రికి ఘనంగా కృతజ్ఞత తెలియజేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం అమాత్యుడు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్, రహదారులు, వీఐపీ, ప్రెస్, పబ్లిక్ గ్యాలరీల ఏర్పాటుపై ఆరా తీశారు. వర్షం కురిసినా సభ సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. పీఆర్, ఆర్అండ్బీ, విద్యుత్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బందికి రోడ్లు, ఇతర ఏర్పాట్ల గురించి మ్యాపులు వేసి వివరించారు.
జిల్లాలోని పల్లెలు, పట్టణాల నుంచి ప్రజలు చీమల దండులా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అనతికాలంలోనే సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి పూనుకున్నదని చెప్పారు. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రికి ఎనలేని అభిమానమన్నారు. ఇందులో భాగమైన పెద్దపల్లిపై కూడా ప్రేమాభిమానాలు చూపిస్తారని పేర్కొన్నారు. ఈ గడ్డ నుంచే ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు. గతంలో ఇక్కడి నీరందక ఆఖరి ఆయకట్టు రైతుల మధ్య యుద్ధాలు జరిగే భయంకర పరిస్థితులు ఉండేవని, కానీ కాళేశ్వరం నిర్మాణంతో ఆ కష్టాలు దూరమయ్యాయని చెప్పారు.
ఇప్పుడు ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండుతున్నాయన్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మరో నాలుగు రహదారుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది సీఎం సభ పూర్తయ్యేదాకా సద్ది పట్టుకొని వచ్చి ఇక్కడ పనులు చేయించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.
ఆర్అండ్బీ, పీఆర్, రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు గొప్పగా పనిచేయాలని నిర్దేశించారు. ఆయన వెంట టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రఘువీర్ సింగ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, బోనాల శ్రీకాంత్, కర్ర రాజశేఖర్ ఉన్నారు.