పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది.. పాలనను గాలికొదిలి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నది’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోదీ, ఇచ్చిన హామీని విస్మరించాడని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడని విమర్శించారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో సీపీఐ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాడ, అమరవీరుల స్తూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పార్టీ జెండాను సీపీఐ కంట్రోల్ కమిషన్ మెంబర్ వై.గట్టయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడారు.
బీజేపీ, దాని అనుబంధ సంఘాలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, సంఘ్ పరివార్ శక్తులు మైనార్టీలు, దళితుల మీద దాడులకు దిగుతూ ప్రజాస్వామాన్ని ఖూని చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందన్నారు. బీజేపీ దమనకాండను ఎదుర్కొనేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మోదీ ఫాసిస్టు, నియంతృత్వ విధానాలను ఎదిరించకుంటే దేశం అంధకారంగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నదని దునుమాడారు. తెలంగాణలో సైతం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ తప్పా ఇంకెవ్వరూ లేరని విమర్శించారు. మతోన్మాద శక్తులను నిలువరించేందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు.
మహాసభల్లో ప్రజా నాట్యమండలి కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. పార్టీ సీనియర్ నేతలను ఘనంగా సత్కరిం చారు. ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, సీనియర్ నేతలు కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి లక్ష్మణ్, మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఎల్.ప్రకాశ్, కందుకూరి రాజరత్నం, కన్నం లక్ష్మీనారాయణ, కన్నెబోయిన కనకరాజు, గోసిక మోహన్, శనిగరపు చంద్రశేఖర్, మద్దెల దినేశ్, ఆసాల రమ, మనోహర్, ఎజ్జే రాజయ్య, రాజమెగిలి, కోడం స్వామి, తాళ్లపల్లి మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని లెనిన్, ఈదునూరి ప్రేమ్, నాయకులు మార్కపురి సూర్య, తొడుపునూరి రమేశ్, మల్లయ్య, ఆసాల మధునయ్య ఉన్నారు.