జ్యోతినగర్, ఆగస్టు 25: ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిలపై సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నిరసనలో భాగంగా గురువారం లేబర్గేట్లో కార్మికులు, నాయకులు రాస్తారోకో చేశారు. పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని, లాఠీచార్జి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నిరసనకు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొని దాడిని ఖండించి సంఘీభావం తెలిపారు. ఇక్కడ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్‌సింగ్, జేఏసీ నాయకులు కౌశిక హరి, నాంసాని శంకర్, చిలుక శంకర్, డీ సత్యం, రాయమల్లు, నాగభూషణం, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, భూమయ్య, లక్ష్మణ్, నాగభూషణం, సీఐటీయూ నేత వై యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
కేసులు నమోదు చేయాలి
ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై జరిగిన లాఠీచార్జికి బాధ్యులైన ఎన్టీపీసీ, సీఐఎస్ఎఫ్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గాయపడ్డ ఐఎఫ్టీయూ నాయకులు ఈసంపల్లి రవీందర్‌తో కలిసి ఎన్టీపీసీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఆదేశాల మేరకు ఏ హెచ్చరికలు లేకుండా అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
యాజమాన్యం కాంట్రాక్టర్లతో కుమ్ముకై పారదర్శకంగా చేపట్టాల్సిన కాంట్రాక్ట్ కార్మికుల వారసత్వ ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టిన్నట్లు ఆరోపించారు. కార్మికుల పెండింగ్ డిమాండ్లు, నూతన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. జేఏసీ సంఘాలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఐఎఫ్టీయూ అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కే విశ్వనాథ్, సహాయ కార్యదర్శి ఈ రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఈ రాజేందర్, కేసీకేఎస్ ప్రధానకార్యదర్శి పీ స్వామి, ఉపాధ్యక్షుడు పీఎన్ భూషణం, నాయకులు గుండు రాజయ్య, పద్మ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
బాధితులకు పరామర్శ
లాఠీచార్జిలో గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులను ఎన్టీపీసీలోని వారి నివాసాల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పరామర్శించారు. ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ దాడిని ఖండించారు. జేఏసీ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఇక్కడ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, రామాచారి, పురుషోత్తం, రాఘవరెడ్డి తదితరులున్నారు.
దాడిపై ఖండన
కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ లాఠీచార్జిని రామగుండం బీ థర్మల్ స్టేషన్ తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఎస్) ఖండించింది. రామగుండంలో నిర్వహించిన యూనియన్ శాఖ సమావేశంలో రాష్ట్ర, రీజినల్ కమిటీ నాయకులు మాట్లాడారు. దాడిలో జేఏసీ నేత కౌశిక హరి, అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు గాయపడ్డారని వివరించారు. యూనియన్ రీజినల్ అధ్యక్షుడు జాగటి శ్రీకాంత్‌కుమార్ అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో తెలంగాణ జెన్కో ప్రధాన కార్యదర్శి గుర్రాల నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లగిశెట్టి రవికుమార్, నాయకులు నూనె రాజేందర్, సాధు కనకయ్య, నాగమల్లు, రాజేశ్ ఉన్నారు.
బంద్ సంపూర్ణం
లాఠీచార్జికి నిరసనగా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్టీపీసీ పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని పెట్రోల్ బంకులు, దుకాణాలు, పాన్‌షాప్‌లు, హో టళ్లు బంద్ చేసి సంఘీభావం తెలిపారు. బంద్‌కు సహకరించిన అందరికీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్‌సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.