ముస్తాబాద్, ఆగస్టు 25: ‘సార్..మా డాడి తాగొచ్చి మమ్మిని కొడుతుండు..ఇంట్ల రోజూ లొల్లి పెడుతున్నడు..ఎంత జెప్పిన బంజెత్తలేడు..మీరైనా తాగుడు మాన్పించండి’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేండ్ల బాలుడు రెండు రోజుల కిందట ‘డయల్ 100’కు ఫోన్ చేశాడు..అంతటితో ఆగకుండా గురువారం ఏకంగా ఠాణాకు వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చిన తీరును చూసి పలువురు ఆశ్చర్యపోయారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన బంగ బాలకిషన్-దీపిక దంపతుల ఎనిమిదేండ్ల కొడుకు భరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. తండ్రి ప్రవర్తను చూసి విసుగు చెందిన బాలు డు మంగళవారం ‘100’ నంబర్‌కు ఫోన్ చేశాడు. తన తండ్రి తాగుడుకు భానిసై నిత్యం మమ్మిని కొడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేగాకుండా గురువారం ఉదయం ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఎస్ఐ వెంకటేశ్వర్లు బాలుడి తల్లిదండ్రులను పిలిపించాడు. వారి సమక్షంలోనే బాలుడిని ప్రశ్నించాడు. ‘ మీ డాడిపై కేసు పెట్టి జైలుకు పంపమంటవా? నిన్ను హాస్టల్లో చేర్పిస్తా చదువుకుంటావా? 100 నంబర్‌కు ఫోన్ చేయాలని నీకు ఎవరు చెప్పారు? అని అడిగాడు. దీనికి బాలుడు మాడాడిని జైలుకు పంపి తాగుడు మాన్పించాలని..100 నంబర్‌కు ఫోన్‌చేస్తే పోలీసులు వస్తారని తనకు తెలుసని.. హాస్టల్ చేర్పిస్తే బాగా చదువుకుంటానని ఠక్కున సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ సమక్షంలో తండ్రికి కౌన్సెలింగ్ చేశాడు. ప్రవర్తన మార్చుకోవాలని, భార్యాబిడ్డను బాగా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించి పంపించాడు.