శంకరపట్నం, ఆగస్టు 24: బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల మంజూరును సులభతరం చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (జేఎంఎల్‌బీసీ) సమావేశం యూబీఐ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో సహకరించాలని బ్యాంక్ ప్రతినిధులను కోరారు.
పంట రుణాలను ప్రతి రైతుకు ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుల మీద ఉందని చెప్పారు. పీఎంజేబీవై, పీఎంఎస్బీవై, పీఎంఎస్ఎంఈ, ఏపీవై, ముద్ర, పీఎంఈజీపీ తదితర పథకాలపై మరింతగా అవగాహన కల్పించాలని తెలిపారు. రైతుల్లో కిసాన్ క్రెడిట్ కార్డులపై ఉన్న అపోహలు తొలగించి దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. పంట రుణమాఫీపై రైతుల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
పాత కార్పొరేషన్ రుణాల గ్రౌండింగ్, పెండింగ్, రికవరీ, ఎంత మేరకు రుణాలు ఇచ్చారు, ఏ మేరకు ఎన్పీఏ ఉంది, డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి తదితర అంశాలపై బ్యాంకుల వారీగా విశ్లేషించారు. ఎస్‌హెచ్‌జీ, వ్యవసాయ, వ్యక్తిగత రుణాల మంజూరులో ఖాతాదారులను సతాయించకుండా నిబంధనల మేరకు ఇవ్వాలని ఆదేశించారు. రెన్యువల్ విధానంపై పలు సూచనలు చేశారు. ఔత్సాహిక మహిళలను చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలన్నారు. దీనికి రూ. 20 లక్షల వరకు రుణ ప్రోత్సాహం అందించాలని తెలిపారు. పథకంలో 35 శాతం సబ్సిడీ ఉంటుందని వివరించాలన్నారు.
సమావేశానికి పలువురు బ్యాంకు మేనేజర్లు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా శాఖల బ్రాంచ్ కంట్రోలర్లు, జిల్లా అధికారులను వివరణ కోరారు. నాబార్డ్ డీడీఎం అనంత్ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, రుణాలు, గ్రాంట్లపై అవగాహన కల్పించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారి నవీన్‌కుమార్, డీఆర్డీవో డీపీఎం రమణయ్య, సైదాపూర్ ఎంపీడీవో పద్మావతి, శంకరపట్నం ఎంపీవో బషీరొద్దీన్, ఏవో శ్రీనివాస్, ఏపీఎం సుధాకర్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాల బ్యాంకుల ప్రతినిధులు, సీసీలు పాల్గొన్నారు.