శంకరపట్నం, ఆగస్టు 24: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా బుధవారం వేకువజామున ఆయన మండలంలోని ఎరడపల్లి, అర్కండ్ల, కన్నాపూర్, రాజాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఎరడపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అర్కండ్ల గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. అర్కండ్లతో పాటు కన్నాపూర్, రాజాపూర్ గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కల్యాణ మండపానికి భూమి పూజ
కొత్తగట్టు గుట్టపై శ్రీమత్స్యగిరీంద్రస్వామిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ఆలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. మత్స్యగిరీంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ చంద్రశేఖర్, ఎంపీవో బషీరొద్దీన్, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచులు రంజిత్‌రావు, అనిత, వెంకటరమణారెడ్డి, వసంత, కిషన్‌రావు, ఎంపీటీసీలు సంపత్, భాగ్యలక్ష్మి, లక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, ఆలయ చైర్మన్ శ్యాంరావు, ఈవో శ్రీనివాస్, డైరెక్టర్లు, అర్చకులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.