రామగిరి, ఆగస్టు 24: ఉన్నంతలో హాయిగా బతుకుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. చేతికొచ్చిన కొడుకులు అనంతలోకానికి వెళ్లిపోవడం ఆ నిరుపేద తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. రెండేండ్ల క్రితం దేశ రక్షణ కోసం సైన్యంలో చేరిన పెద్దకొడుకు ఆత్మహత్య చేసుకోగా, అండగా ఉంటాడనుకున్న చిన్నకొడుకు నేడు అనారోగ్యంతో మృతిచెండంతో ఆ నిరుపేదల కలలు చెదిరిపోయాయి. వివరాల ప్రకారం.. రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన శాలీగామా నారాయణ – కళ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీలో చేరాడు.
చిన్న కొడుకు రాజు (26) ఇక్కడే మేస్త్రీ పని చేసుకుంటున్నాడు. అటు తండ్రి నారాయణ గొర్రెల కాపరిగా, తల్లి కళ కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు. కాగా 2020 జూలై 2న శ్రీనివాస్ జమ్ము కశ్మీర్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఇంకా ఆ బాధ నుంచి తేరుకోకముందే మరో విషాదం నెలకొంది. ఐదు రోజుల క్రితం తల్లి కళ అనారోగ్యంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా, చిన్న కొడుకు రాజు తన రక్త కణాలను ఇచ్చాడు. దాంతో ఆరోగ్యం కుదుటపడి తల్లి ఇంటికి చేరుకున్నది.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం చిన్న కొడుకు రాజుకు జ్వరం రావడంతో మంచిర్యాల దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు రాజుకు రక్తకణాలు తగ్గాయని వెంటనే కరీంనగర్‌కు తీసుకువెళ్లాలని చెప్పడంతో తరలిస్తుండగా, గోదావరిఖని వద్దకు వెళ్లగానే పరిస్థితి విషమించి మరణించాడు. ప్రభుత్వ దవాఖానలో చూపించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కొడుకులను కోల్పోయిన సంఘటనతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.