హుజురాబాద్‌టౌన్, ఆగస్టు 24: వేగంగా వస్తున్న డీఎసీఎం వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీకొనగా వ్యాన్ ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ బ్రిడ్డిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కి చెందిన సింగాపురం లిటిల్ కుమార్(29) డీఎసీఎం వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి హనుమకొండ నుంచి నాందేడ్‌కు అరటికాయలు లోడ్ చేసుకొనేందుకు వెళ్తుండగా తుమ్మనపల్లి శివారులో కరీంనగర్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ క్రమంలో డీసీఎం వ్యాన్ బ్రిడ్జిపై నుంచి కాకతీయ కెనాల్లో పడిపోయింది. వ్యాన్ డ్రైవర్ లిటిల్ కుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌లో ఉన్న శ్యామ్‌కుమార్, వంశీకి స్వల్ప గాయాలయ్యాయని హుజురాబాద్ టౌన్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ తెలిపారు. మృతుడి తల్లి సింగాపురం పద్మ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ రాజుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా బ్రిడ్జిపై నుంచి కెనాల్లో పడిన డీసీఎం వ్యాను పైకి తీసుకొని రావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కాలువపై సైడ్ వాల్స్ బాగా లేకపోవడంతో తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకనైనా సైడ్‌వాల్స్ మరమ్మతు చేయాలని పలువురు కోరుతున్నారు.