పెద్దపల్లి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/ కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్ : సీఎం కేసీఆర్ పెద్దపల్లి పర్యటన సందర్భంగా ఈ నెల 29న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్లతో పాలనను చేరువ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపేందుకు లక్ష మందితో కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29న పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభించేందుకు పెద్దపల్లికి సీఎం వస్తున్న సందర్భంగా..
బుధవారం ఎమ్మె ల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలో సభాస్థలి, టీఆర్ఎస్ భవన్ వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్‌లో టీఆర్ఎస్ ము ఖ్య కార్యకర్తలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సభ విజయవంతం కోసం ప్రతి కా ర్యకర్తా కృషి చేయాలని, అన్ని గ్రామాల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించాలని ఎంపీ, ఎమ్మెల్యే నిర్దేశం చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్‌తో ప్రజలకు ఒకే చోట అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని, సేవలు మరింత చేరువ అవుతాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలతోపాటు ధర్మపురి నియోజకవర్గం నుంచి సీఎం సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి కృతజ్ఞతలు తెలుపాలని పిలుపునిచ్చారు. కాల్వశ్రీరాంపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, విండో చైర్మన్లు చదువు రాంచంద్రారెడ్డి, గజవెళ్లి పురుషోత్తం, ఏఎంసీ చైర్ పర్సన్ కొట్టె సుజాత రవీందర్, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గొడుగు రాజ్‌కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్య.. సుల్తానాబాద్‌లో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతరమేశ్, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, పార్టీ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.