జగిత్యాల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను చేరువ చేయాలని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని సీఎం కేసీఆర్ భావించారు. ఆ మేరకు 2016లో జిల్లా పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారిపోగా, కొత్త జిల్లా కేంద్రాల్లో సకల హంగులతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే సిరిసిల్లలో ప్రారంభోత్సవం చేసుకోగా, జగిత్యాల, పెద్దపల్లిలో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేశారు.
జగిత్యాల జిల్లాకేంద్రంలోని ధరూర్ క్యాంపులోని ఎస్సారెస్పీకి చెందిన 33ఎకరాలను కేటాయించగా, 2017 అక్టోబర్ 12న మంత్రులు శంకుస్థాపన చేశారు. 49.20 కోట్లతో నూతన కలెక్టరేట్‌ను నిర్మించారు. కేటాయించిన ఎనిమిదెకరాల్లో జీప్లస్ 2 విధానంలో భవనాన్ని పూర్తి చేశారు. 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్ కార్యాలయం, 2877 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగుల వైశాల్యంలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. ఇక పక్కనే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా స్థాయి అధికారుల క్యాంపు కార్యాలయాలను రెండున్నరేళ్ల క్రితమే నిర్మించగా, ప్రస్తుతం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆయా క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
సకల సౌకర్యాలు..
కలెక్టరేట్‌ను జీప్లస్ 2 పద్ధతిలో ఆధునిక హంగులతో నిర్మించారు. కార్యాలయంలో 31 శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు గదులను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లను నిర్మించారు. అలాగే విజిటర్స్ వెయింటింగ్ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్‌ను నిర్మించారు. అలాగే మూడు మినీ మీటింగ్ హాల్స్‌ను సైతం నిర్మించారు. కలెక్టర్, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలన అధికారి చాంబర్లను కేస్ట్ సీలింగ్ (సెంట్రల్ ఏసీ) చేశారు. అలాగే సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్ ఏసీ చేశారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన కలెక్టరేట్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కొద్ది నెలల క్రితమే పూర్తయింది. అలాగే కలెక్టరేట్ పై భాగంలోకి చేరుకునేందుకు రెండు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కోసం 315కేవీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు, 160కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ చుట్టూ ప్రహరీ నిర్మించారు. మొత్తంగా సకల సౌకర్యాలతో అన్ని వసతులతో అధునాతన పద్ధతిలో జగిత్యాల సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.
వచ్చే నెల 10న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు..
సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని వచ్చే నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, తెలంగాణ భవన్, హెలీప్యాడ్, బహిరంగ సభ స్థలాన్ని బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల, వేములవాడ ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, చెన్నమనేని రమేశ్ బాబు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్లు శ్రీలత, అరుణశ్రీ, ఆర్డీవో మాధురి, డీఎస్పీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.