పెద్దపల్లి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం ముస్తాబవుతున్నది. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా టీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఓవైపు జిల్లా యంత్రాంగం, మరో వైపు టీఆర్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహించనుండగా, తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎంపీ వెంకటేశ్‌నేతకాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలోని హెలీప్యాడ్ నుంచి కలెక్టరేట్ దాకా, అక్కడి నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించే పెద్దకల్వలలోని ఆటోనగర్ దారి దగ్గరి వరకు రోడ్లను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. కలెక్టరేట్ నుంచి టీఆర్ఎస్ భవన్ దాకా ఉన్న రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేయించడంతో పాటుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ఎల్ఈడీ లైట్లను అమర్చుతున్నారు. ఇరువైపులా ఉన్న గోడలకు రంగు రంగుల చిత్రాలు వేయిస్తున్నారు.
50ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ సంగీత సత్యనారాయణ పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైతే జాలి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం సర్వం సిద్ధం చేస్తున్నామని, క్షేత్రస్థాయి అధికారులకు విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ తెలిపారు. సభ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ ఈఈ నరసింహ చారి, జిల్లా అటవీ అధికారి శివయ్య, ఆర్అండ్బీ డీఈ రాములు, పెద్దపల్లి తహసీల్దార్ సుధాకర్, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.