కమాన్చౌరస్తా, జనవరి 20 : వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అనుమానాలు అవసరం లేదని, బ్రహ్మోత్సవాలను కరోనా నిబంధనల మేరకు ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బుధవారం మారెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పంచమ బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలక మండలి సభ్యులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటించాల్సిన కరోనా నిబంధనలు, వలంటీర్ల సేవలు, భోజన ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. .సన్నాహక సమావేశం కోసం వచ్చిన మంత్రి గంగుల కమలాకర్, తొలుత స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమై, 13వ తేదీ వరకు కొనసాగనున్నాయన్నారు.
మొదటి మూడుసార్లు బ్ర హ్మోత్సవాలు ఘనంగా కొనసాగినా, నాలుగోసారి ఉత్సవాలు కరోనా వల్ల గుడికే పరిమితం చేశామన్నారు. ఈసారి తిరుమల తిరుపతికి చెందిన వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, పంచమ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. గతంలో నిర్వహించిన శోభాయాత్రల్లో ఒకగజ వాహనాన్ని ఏర్పాటు చేశామని, కానీ, ఈసారి శోభాయాత్రలో 2 గజ వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణ, ఏరోజు ఏం చేయాలనే దానిపై తిరుపతి పండితుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులకు అన్నదానం చేసేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు బియ్యం సమకూర్చడంతో పాటు, కిరాణ సామగ్రి కూడా ఇస్తామన్నారని తెలిపారు. కల్యాణం రోజు భక్తులకు ఇచ్చేందుకు తిరుపతి నుంచి లడ్డూలు తెప్పిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా జరిగిన స్వామి వారి కల్యాణం, పుష్పాభిషేకం, చక్రస్నానాలకు వేదిక సరిపోవడం లేదని, పండితుల సూచన మేరకు అమరవీరుల స్తూపం వరకు వేదికను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరి శంకర్, ఆలయ ఈవో పీచర కిషన్ రావు, చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్, పాలకవర్గ మండలి సభ్యులు గంప రమేశ్, గోగుల ప్రసాద్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.