హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట రూరల్, ఆగస్టు 22: దళిత బంధు పథకం నిరుపేద దళితుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ఆకునూరి కేజియాకు దళితబంధు ద్వారా మంజూరైన మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు మేకమల్ల రమేశ్, మేకల లక్ష్మి సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫాంను సర్పంచ్ మూగల పరశురాములుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు నిరుపేద దళితులను పట్టించుకోలేదన్నారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి దళిత కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణిసురేందర్రెడ్డి, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, సిర్సపల్లి సర్పంచ్ సువర్ణల సునియం, ఎంపీటీసీ ఎం రాధమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బర్మావత్ రమాయాదగిరినాయక్, ప్రముఖ వైద్యుడు రామలింగారెడ్డి, మడిపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అంకూస్, సారంగం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.