కార్పొరేషన్, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సమావేశానికి నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి తరలివెళ్లారు. కరీంనగర్ నగరపాలక సంస్థ నుంచి అధికారులు, సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు సోమవారం ఉదయం 33వ డివిజన్లోని మేయర్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిందన్నారు. యువతలో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందేలా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగాయన్నారు. ముగింపు వేడుకలను కూడా అత్యంత ఆట్టహాసంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలోని 18, 19 డివిజన్లతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సుల్లో నాయకులు, ప్రజలు ముగింపు ఉత్సవాలకు తరలివెళ్లారన్నారు.
సభకు తరలిన అధికారులు
కలెక్టరేట్, ఆగస్టు 22 : రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సభకు జిల్లా అధికారులు తరలివెళ్లారు. పక్షంరోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని నింపే వివిధ రకాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం అందరి మన్ననలు అందుకున్నది. చివరిరోజు వీరందరికీ లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించే ముగింపు సభకు హాజరుకావాలంటూ సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎల్ శ్రీలత, డీసీవో శ్రీమాల, డీఎంహెచ్‌వో జువేరియా, డీడబ్ల్యూవో వీ పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళిక డిప్యూటీ డైరెక్టర్ కొమురయ్య, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డీఎస్డీవో రాజవీరు, పరిశ్రమల శాఖ మేనేజర్ నవీన్‌కుమార్‌తో పాటు పలు ప్రభుత్వ విభాగాల అధికారులు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాజధానికి ప్రత్యేక బస్సులో వెళ్లారు.