మేడిపల్లి, ఆగస్టు 20 : దళితులు ఆర్థికంగా పురోగమించడానికే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో దళితబంధు నిధులతో లబ్ధిదారుడు దయ్య గంగరాజం ఏర్పాటు చేసిన ‘కలర్ వరల్డ్’ షాపును శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం నూతన మండలంగా ప్రకటించిన భీమారానికి వెళ్లగా.. గ్రామస్తులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించి నినాదాలు చేశారు.
వరదకాలువ వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. వరదకాలువ నుంచి భీమారం గ్రామం వరకు భారీ ర్యాలీ తీశారు. వెంకట్రావుపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని తొలగించి, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని విద్యాకమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్ రావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, కథలాపూర్ జడ్పీటీసీ నాగం భూమయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.