ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 20 : గోదావరిఖని గంగానగర్‌లో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హెల్మెట్ ధరించి వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 7 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న కొరకొప్పుల రాజేందర్(43)ని అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌పై పడుకొని అతని తల భాగంలో గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన సమయంలో అతని భార్య రవళి బాత్రూమ్కు వెళ్లింది. కాగా, ఘటన విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రూపేశ్ హత్య స్థలాన్ని పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన గన్‌కు లైసెన్స్ ఉందా? లేదా? అని విచారిస్తున్నామని, నిందితుల కోసం రెండు పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే, వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మృతుడి భార్యకు బావ వరుస అయిన వ్యక్తితో సంబంధం ఉందన్న విషయమై గతంలో పంచాయతీలు జరిగినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇంటికి కరెంట్ షాక్ పెట్టి హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్‌టౌన్ సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్‌గౌడ్ ఉన్నారు.