వజ్రోత్సవ వేడుక అంబరాన్నంటున్నది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతున్నది. శనివారం 13వ రోజు ఊరూరా రంగవల్లుల పోటీ నిర్వహించగా, స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడింది. ఆయా చోట్ల ముగ్గుల కాంపిటీషన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు దేశభక్తిని ప్రతిబింబించేలా రంగవల్లులను ఆవిష్కరించారు. భరతమాత, త్రివర్ణ పతాక రంగవల్లులు వేశారు. కాగా, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో పోటీలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించగా, కరీంనగర్లో విజేతలకు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బహుమతులను ప్రదానం చేశారు.

కరీంనగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): వజ్రోత్సవాల స్ఫూర్తి వెల్లివిరుస్తున్నది. రోజుకో కార్యక్రమంతో జనం దేశభక్తిని చాటుతున్నది. శనివారం జిల్లా వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. దేశభక్తి వెల్లి విరిసే విధంగా మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో సర్పంచ్ కాటుక వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు.
ఆనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రంగవల్లుల కాంపిటీషన్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, డీఆర్డీఓ ఎల్ శ్రీలత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహమతులు అందించారు. చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
హుజూరాబాద్ పట్టణంలో స్థానిక మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీకి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఇలా జిల్లాలోని అనేకచోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించి స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మహిళల సంబురాలకు భాగస్వామ్యం కల్పించారు.