స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని సందేశాత్మక రంగవల్లులతో దేశభక్తిని చాటారు. విజేతలను ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 20: హుజూరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగవల్లులను తీర్చిదిద్దారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ నిర్మలాశ్రీనివాస్ తదితరులు ముగ్గుల పోటీలను పరిశీలించారు. సీహెచ్ రమ ప్రథమ బహుమతి, లాస్య ద్వితీయ బహుమతి, చాంద్ తృతీయ బహుమతి సాధించగా విజేతలకు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, బల్దియా మేనేజర్ రాజారామ్మోహన్రాయ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీ మహిళలు, మున్సిపల్ మహిళా కార్మికులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఆగస్టు 20: ముగ్గులు సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నాలని, వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలతో పండుగ వాతావరణం నెలకొందని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ సీఐ రాంచందర్‌రావు పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రంగవల్లులు వేశారు. మనస్విని(ప్రథమ), సౌజన్య(ద్వితీయ), నిర్మల(తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కమిషనర్ సమ్మయ్య, ఎస్ఐ యూనిస్ అలీ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 20: మండలంలోని చెల్పూర్ గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ చూపిన గన్ను సోనియా వర్ధినికి బహుమతి అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, కారోబార్ మధుసూదన్‌తో పాటు వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 20: మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ ప్రతి ఒక రూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి ప్రతిబింబించేలా రంగవల్లులు వేసిన యువతులు, మహిళలను ఆయన అభినందించారు. బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యుడు రేగుల సురేశ్, వీవో ఏ శ్రీలత, యువతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందేశాత్మక రంగవల్లులను తీర్చిదిద్ది దేశభక్తిని చాటారు. మండల కేంద్రంలో ముగ్గుల పోటీల్లో విజేతలు శ్యామల, పద్మకు ఉప సర్పంచ్ వోరెం భానుచందర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రవూఫ్, వార్డు సభ్యులు సంపత్, వోరెం సుమతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.