కమాన్‌చౌరస్తా, ఆగస్టు 20: విద్యార్థుల్లో చదువుతో పాటు దైవభక్తిని పెంపొందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ వై సునీల్ రావు హాజరై పాఠశాలలో ‘హెల్త్ బేసిక్స్’ క్లినిక్ సెంటర్‌ను, అనంతరం ఇసాన్ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య మాట్లాడుతూ, పాఠశాలలో విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ రథయాత్ర భగత్‌నగర్ పురవీధుల గుండా స్టేడియం మీదుగా ప్రతిమ మల్టీప్లెక్స్ వరకు సాగింది. శోభాయాత్రలో చిన్నారుల నృత్యాలు, గోపికాకృష్ణుల వేషధారణ, మహిళల కోలాటం, భజనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాలలో మహాభిషేక కార్యక్రమం, తర్వాత ఇసాన్ గురూజీ గీతా సారాంశం, మానవత విలువలు స్ఫురించే ఆధ్యాత్మిక ప్రవచనాలు జరిగాయి. అలాగే, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, ఆకుల నర్మద- నర్సయ్య, మేచినేని వనజ-అశోక్ రావు, కాసర్ల ఆనంద్, ప్రిన్సిపాల్ మిథున్ జే మిస్ట్రీ, ఏవో తుంగని సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.