కథలాపూర్, ఆగస్టు 14: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యానికి గురై తిరిగి ఇంటిబాట పట్టగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మ్యాదరి మోహన్ (35) ఉపాధి కోసం ఏడాదిన్నర కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడ జ్యూస్ తయారీ కేంద్రంలో పని చేసేవాడు. ఆరు నెలలుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి వచ్చి మెరుగైన వైద్యం చేయించుకోవాలని ఈనెల 10వ తేదీన దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకున్నాడు.
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో చేరి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. దుబాయ్ నుంచి వచ్చి ఇంటికి చేరుకోకుండానే హైదరాబాద్లో మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం ఉదయం మోహన్ మృతదేహాన్ని సిరికొండకు తీసుకువచ్చారు. అందరితో కలివిడిగా ఉండే మోహన్ మృతితో సిరికొండలో విషాదం అలుముకున్నది. అతడికి భార్య లత, ఇద్దరు కుమారులు అక్షయ్, నిహాల్ ఉన్నారు.