కొత్తపల్లి, ఆగస్టు 13: వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఆరో రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా తీసిన ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, యువతీ యవకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. దారివెంట భారీ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ.. ‘భారత్‌మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్లో సీపీ సత్యనారాయణతో కలిసి మేయర్ సునీల్‌రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్ పాల్గొన్నారు. జమ్మికుంటలో కిలోమీటర్ పొడవైన భారీ జెండాతో ర్యాలీ తీయగా, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు పాల్గొని సామూహిక గీతాలాపన చేశారు. గంగాధర మండలం బొమ్మలమ్మ గుట్టపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీఆర్ జెండా ఎగురవేశారు.
వజ్రోత్సవం అంబరాన్నంటుతున్నది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఉత్సాహంగా జరుగుతున్నది. ఆరో రోజు శనివారం జిల్లాలో వజ్రోత్సవ ర్యాలీలు తీశారు. విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘భారత్‌మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. దారి వెంట భారీ జాతీయ జెండాల ప్రదర్శన చేపట్టారు. కాగా, జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం నుంచి టవర్ సర్కిల్ దాకా సాగిన ర్యాలీని ముందుగా సీపీ సత్యనారాయణతో కలిసి మేయర్ సునీల్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, డీవైఎస్వో రాజవీరు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. గంగాధర మండలం బొమ్మలమ్మ గుట్టపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీఆర్ జెండా ఎగరేశారు.
జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి కోర్టు చౌరస్తా దాకా న్యాయవాదులు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, న్యాయవాది, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, పీవీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇక కరీంనగరంలో వరుణ్ మోటార్స్ ఉద్యోగులు తమ వాహనాలతో, ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ తీశారు. జమ్మికుంట పట్టణంలో కిలోమీటరు పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు. వందలాది మంది విద్యార్థులు భారీ పతాకాన్ని చేతబూని ర్యాలీ తీయగా, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. చొప్పదండిలో తహసీల్దార్ రజిత ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత పాల్గొన్నారు.