ఇల్లందకుంట, డిసెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఏడీఏ ఆదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో రైతులు సాగు చేసిన మక్క పంట వివరాలు ఏఈవోలు నమోదు చేయగా గురువారం క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ క్రాప్ బుకింగ్ ఎంగేజ్మెంట్ అప్లికేషన్ నుంచి పంట నమోదు చేస్తారని తెలిపారు. ఇది పూర్తిగా అక్షాంశ రేఖాంశాల సహాయంతో రైతు వేసిన పంటను ఫొటో ద్వారా నమోదు చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో రైతులు వేసిన పంటలను సర్వే నంబర్లతో ఏఈవోలు నమోదు చేస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి ఫొటోలు తీసి నమోదు చేస్తారని వివరించారు. ఏఈవోలు చేసిన సర్వే నివేదిక ఆధారంగా డీఏవో, ఏడీఏ, ఏవోలు ప్రతి వారం క్షేత్ర స్థాయిలో సందర్శించి, పంట నమోదు వివరాలు తనిఖీ చేస్తారని వెల్లడించారు. ఇల్లందకుంటలో 100 ఎకరాల్లో మక్కజొన్న పంటను పరిశీలించామన్నారు. యాసంగిలో రైతు బంధు, రైతు బీమా కోసం నూతన పట్టా పుస్తకాలు పొందిన రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని తెలిపారు. మూడు రోజుల్లో రైతు ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు డబ్బులు జమ చేస్తుందన్నారు. సాగు చేస్తున్న రైతులు పంటల వివరాలను ఏఈవోల దగ్గర తప్పక నమోదు చేసుకోవాలన్నారు. ఇక్కడ ఏవో గుర్ర రజిత, ఏఈవోలు మహేందర్, రాకేశ్, మౌనిక, సంపత్ ఉన్నారు.
పంట మార్పిడితో అధిక దిగుబడి
పంట మార్పిడితో అధిక దిగుబడి వస్తుందని ఏవో గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కొరపల్లి గ్రామంలో మక్కజొన్న సాగును ఏవో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కజొన్న సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తాము పండిస్తున్న పంటల వివరాలను వ్యవసాయశాఖాధికారుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. పంట మార్పిడితో నేల సారం పెరుగుతుందని చెప్పారు. యాసంగిలో వేరుశనగ, మక్క, జొన్న, మినుములు, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, ఆవాలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఇక్కడ రైతులు ఉన్నారు.