సారంగాపూర్, ఆగస్టు 9: తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువరైతు. కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాలు.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్ తొమ్మిదేళ్ల క్రితం సాగుబాట పట్టాడు. తనకున్న ఎనిమిదెకరాల్లో వివిధ రకాల కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో కాకర, సోర, బీర, స్వీట్‌కార్న్, అలసంద, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుడు, బటానీ, నువ్వు పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడి, రాబడి సాధిస్తున్నాడు.
స్వల్ప పెట్టుబడి.. అధిక రాబడి
వెంకటేశ్ ఇటీవల 10 గుంటల్లో రూ.5వేల ఖర్చుతో స్వీట్‌కార్న్ సాయగా రూ.28వేల ఆదాయం వచ్చింది. 12 గుంటల్లో రూ.6వేల పెట్టుబడితో క్యాబేజీ, కాలిఫ్లవర్ సాగుచేయగా రూ.42 వేల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 10 గుంటల్లో కాకర, 20 గుంటల్లో బీర, 8 గుంటల్లో అలసంద, 20 గుంటల్లో కొత్త విధానంలో బటానీ, చిక్కుడు పంటలు సాగు చేస్తున్నాడు. కాలానుగుణంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తున్నాడు. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు ఎక్కువగా వాడకుండా సాగు చేస్తుండడంతో ఖర్ఛు తగ్గి అధిక దిగుబడి, రాబడి సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కూరగాయల సాగుతో లాభాలు
కాలానుగుణంగా డిమాండ్‌కు తగినట్లు కూరగాయలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తున్నది. నాకున్న ఎనిమిదెకరాల్లో బీర, సోర, స్వీట్‌కార్న్, కరబూజ, నువ్వు, కాకర, అలసంద, బటానీ, చిక్కడు తదితర పంటలు సాగు చేస్తున్నాను. పండించిన కూరగాయలు, ఇతర పంటలను జగిత్యాలతో పాటు వివిధ ప్రాంతాల రైతులకు విక్రయిస్తున్నా. కూరగాయల సాగుతో మంచి ఆదాయం వస్తున్నది. కష్టపడి పనిచేస్తున్నందుకు ఫలితం దక్కుతున్నది. ఆసక్తి ఉన్న రైతులు నా పంటపొలాలను సందర్శిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల సాగుపై అవగాహన కల్పిస్తా.
-బండారి వెంకటేశ్, యువరైతు, పెంబట్ల,సారంగాపూర్ మండలం