Ambas Revenge | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి తెరలేపుతూ, పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) తో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “అంబా’స్ రివెంజ్” (Amba’s Revenge). నక్క తోక ఫిలిమ్స్ పతాకంపై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది. మనుషులు ఎవరూ నటించకుండా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ చిత్రంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మహాభారతంలో మహా వీరుడైన భీష్ముని వల్ల అంబ ఎదుర్కొన్న అవమానం, ప్రతీకారంతో ఆమె మరో జన్మలో శిఖండిగా మారి తన పగను ఎలా తీర్చుకుందనే పౌరాణిక ఇతివృత్తాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. నేటి ఆధునిక తరానికి అర్థమయ్యే రీతిలో, సరికొత్త విజువల్స్ తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. టీజర్ లాంచ్ వేడుకలో దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. “ఈ సినిమా పేరు అంబ అయినప్పటికీ, కథను పూర్తిగా శిఖండి కోణం నుండి చూపించబోతున్నాము. సినిమాలో వచ్చే ప్రధాన పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ టీజర్ విడుదల చేశాము. ప్రస్తుతం టీజర్లో ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు.. త్వరలోనే అద్భుతమైన డైలాగ్స్‌తో పూర్తి ట్రైలర్‌ను మీ ముందుకు తీసుకువస్తాము” అని వెల్లడించారు.
చిత్ర నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది ఏఐ (AI) తో సినిమా చేయడం చాలా సులువు మరియు తక్కువ ఖర్చుతో అయిపోతుందని భావిస్తుంటారు. కానీ అది అపోహ మాత్రమే. మేము ఈ సినిమా కోసం ఒక టూల్ ఉపయోగిస్తున్న సమయంలోనే, మార్కెట్లోకి మరో కొత్త టూల్ వస్తోంది. దీనివల్ల సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదురై, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయింది. ప్రస్తుతం అందరూ సోషల్ మీడియా రీల్స్‌లో ఏఐని చూస్తున్నారు, కానీ వెండితెరపై ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి మాట్లాడుతూ.. “మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టాన్ని తీసుకొని ఈ సినిమాగా మలుస్తున్నాము. మీడియా మిత్రులందరూ మా ఈ నూతన ప్రయత్నాన్ని ఆదరించి, తమ పూర్తి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాము” అని తెలిపారు.
అలాగే డైలాగ్స్ & లిరిక్స్ రచయిత కిషోర్ కుమార్ ఏనుగు మాట్లాడుతూ.. “నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో రెండు అద్భుతమైన పాటలు ఉన్నాయి. నేటి తరానికి ఈ పౌరాణిక ఇతివృత్తం సులభంగా అర్థమయ్యే రీతిలో డైలాగ్స్ మరియు సాహిత్యానికి రూపకల్పన చేశాం” అని చెప్పారు.
ఎడిటర్ హ్యారీ బ్రెయిన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం వస్తున్న ఏఐ రీల్స్ ద్వారా ప్రేక్షకులకు ఏఐ సినిమాపై ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది. మా ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా ఒక అపూర్వమైన విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు. ఈ కార్యక్రమంలో విజువల్ డైరెక్టర్ సాయి నేత, క్యారెక్టర్ డిజైనర్ చందు గోసంగి తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.