హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఇటీవల సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, మీడియా కో-ఆర్డినేటర్ మహేశ్ అలియాస్ మాణిక్య మహేశ్, వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మహేందర్రెడ్డి పట్ల ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. పీఎస్ లోపల, ప్రవేశ-నిష్రమణ మార్గాలతోపాటు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పిటిషనర్లను ఘటనాస్థలానికి తీసుకెళ్లిన మార్గాలు, ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని పేర్కొన్నది. ఇకపై పోలీసుల దర్యాప్తునకు హాజరయ్యే సమయంలో పిటిషనర్లు ఇద్దరికీ తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం ఆదేశాలు జారీచేశారు.
అంతకుముందు పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లను ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం వరకు పీఎస్లో ఉంచి, దాడికి అవకాశం కల్పించారన్న అనుమానం ఉన్నదని చెప్పారు. జస్టిస్ మాధవీదేవి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.