హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల్లో ( Road Accidents ) మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోందని డీజీపీ సి. వి. ఆనంద్ ( DGP C.V. Anand ) పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఏడు జిల్లాలను ఎంపిక చేశారని వెల్లడించారు.
ఈ అంశంపై రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తితో కలసి డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సేఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎంపిక చేసిన ఏడు జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు, సంబంధిత యూనిట్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్గదర్శక్ పోర్టల్, డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. దేశంలో ఏటా 1.75 లక్షల మంది మృతిచెందుతుండగా, తెలంగాణలో 7 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదైన 230 ప్రాధాన్య-1 ప్రాంతాలు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 కీలక పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించామని వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ‘4ఈ’ విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబరు 3న చెన్నైలో జరగనున్న సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు, రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని వెల్లడించారు.