విద్యానగర్, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఉద్యోగులు బ్యాంకుల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనిటైడ్ ఫోరం బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సీహెచ్ నిఖిల్ కుమార్, కన్వీనర్ వెల్దండి దామోదర్ మాట్లాడుతూ దేశంలోని మధ్యతరగతి, పేద ప్రజలకు దేశ అభివృద్ధి ఫలాలు అందాలని, వారు కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో దేశంలో జాతీయ బ్యాంకులు ఆవిర్భవించాయన్నారు. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ బ్యాంకులు దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నాయన్నారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితంతో నడుస్తున్న ప్రభుత్వ బ్యాంకుల మీద కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వం కన్ను పడిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజ్‌కుమార్, శ్రీరాంభద్రయ్య, అట్టెపల్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు ఎల్ఐసీ సంఘం మద్దతు
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు సిబ్బంది, అధికారులు చేస్తున్న సమ్మెకు ఎల్ఐసీ, అతిపెద్ద కార్మిక సంఘం అయిన ఏఐఐఈఏ పూర్తి మద్దతు తెలిపింది. బస్టాండ్ కాంప్లెక్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని ఎల్ఐసీ యూనియన్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అందరూ వ్యతిరేకించాలని కోరారు. స్థానిక జీవిత బీమా మండల కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించి బ్యాంకు సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వెంకటరమణ, రామ్మోహన్ రావు, రవీంద్రనాథ్, వామన్‌రావు, సూర్యకళ, డీవో యూనిట్ నాయకులు ఆనందం, బసవేశ్వర్, అనుపమ, ప్రభాకరచారి, శ్రీదేవి, వెంకటస్వామి, బ్రాంచ్-1నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.