– హుజూరాబాద్, జూలై 30:ప్రతి ఆవాసానికి శుద్ధజలాలను అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. పట్టణాల నుంచి మారుమూల పల్లెల దాకా సురక్షిత జలాలను అందిస్తున్నది. అయితే, కొందరు భగీరథ నీరు సురక్షితం కాదని అసత్య ప్రచారానికి తెరలేపారు. సోషల్ మీడియా వేదికగా అబద్దపు పోస్టులు పెడుతున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు సర్కారు నడుం బిగించింది. ల్యాబ్ కెమెస్ట్లతో పరీక్షలు చేయిస్తూ ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
మానవుల ఆరోగ్యానికి స్వచ్ఛమైన జలమే ప్రధానం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ మంచినీరు అందించాలని సంకల్పించింది. ఈ దిశగా బృహత్తరమైన పథకం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టింది. లక్షల మైళ్ల మేర పైప్లైన్లు వేసి ఊరూరా వాటర్ ట్యాంకులు నిర్మించి, ఇంటింటికీ నల్లా బిగించి ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది. నీటి శుద్ధీకరణ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో నీళ్లతో వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్న కొందరు వ్యాపారులు అసత్యపు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాంలలో భగీరథ నీటిపై అసత్య కథనాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఊరూరా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు నిర్దేశించింది. ఇటీవల హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, కందుగుల గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ల ప్రాధాన్యత, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కెమిస్ట్లతో పరీక్షించి మరి ఇందులోగల పోషక లవణాలను వివరించారు.
మినరల్వాటర్లో రసాయనాలు?
నీళ్లను సక్రమంగా ఫిల్టర్ చేయకపోవడం.. నీళ్లను శుద్ధి చేసే ప్రక్రియలో ప్లాంట్ల నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల కీళ్లు, మూత్ర పిండాల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్లాంట్లు యజమానులు సక్రమంగా మిషన్లను వాడకపోవడంతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో పోషక లవణాలు సైతం తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.