ఇండోర్, ఫిబ్రవరి 17: అనుకున్నది సాధించడానికి వయసు అడ్డుకాదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ నిరూపించింది. 78 ఏండ్ల వయసులో ఎం.ఏ మరాఠీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత ఉన్నత విద్య అభ్యసించాలన్న తన కోరికను నెరవేర్చుకున్న సుశ్మా మోఘె, దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి ఎం.ఏ మరాఠీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించింది. మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆమెకు మంగళవారం స్నాతకోత్సవంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ బంగారు పతకాన్ని అందజేశారు. కోర్సు పూర్తిచేయటంలో వర్సిటీ అధ్యాపకులు తనకు పూర్తిగా సహకరించారన్న సుశ్మా మోఘె.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.