ఓదెల, జూలై 30: సర్కారు బావి.. ఈ పేరు వినగానే ఒకప్పుడు పల్లె ప్రజలు తాగునీటిని ఇరు వైపులా చేది తీసుకెళ్లిన దృశ్యాలే కండ్లముందు కదలాడుతాయి. ప్రతి ఊరిలో ఇలాంటి బావులు ఒకటి, రెండు ఉండేవి. కానీ, ఇప్పుడవి కనుమరుగయ్యాయి. చాలా వరకు కూడిపోయి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. అయితే, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లెలో మాత్రం నేటికీ సర్కారు బావి కనిపిస్తుంది. ఇక్కడి బావి కూడా భూమికి సమాంతరంగా ఉండి మూలనపడింది. ఈ గ్రామం చిన్నది కాగా, ఇక్కడ 130 వరకు ఇండ్లు ఉంటాయి. అయితే, ఊరిలో ఎవరింట ఏ శుభకార్యమైన కూరాళ్లు పట్టేందుకు బావులు లేవు. పెండ్లిళ్లకు ముందు మంచినీటి బావుల వద్దకు మహిళలు కుండలు పట్టుకుని పోయి నీళ్లు తెచ్చుకోవడం(కురాళ్లు పట్టడం) ఆనవాయితీ. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ ఒజ్జె కోమలత సర్కారు బావికి మరమ్మతులు చేయించారు. గాజులు(చుట్టూ సిమెంట్ రింగ్) పోయించి ఆధునీకరించారు. ఇప్పుడు ఎవరింట శుభకార్యాలు జరిగినా వారు ఇక్కడికి వచ్చి కూరాళ్లను పట్టుకుంటున్నారు. ఒకప్పుడు తాగునీటి అవసరాలను తీర్చిన బావి ఇప్పుడు పెండ్లిళ్లకు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఊరికి ఎవరైనా చుట్టాలు, అధికారులు వచ్చినా ఈ బావిని ఆసక్తిగా తిలకిస్తూ వెనుకటి రోజులను గుర్తు చేసుకుంటుండడం విశేషం.