రాంనగర్, జూలై 30 : మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా పై శనివారం పీడీయాక్టును అమలు చేస్తే ఉత్తర్వులను సీపీ సత్యనారాయణ జారీ చేశారు. వీరిలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహ్మదాపూర్కు చెందిన శివరాత్రి సంపత్, అదే గ్రామానికి చెందిన కొనేటి కిరణ్, సూర రాజు, పందిపల్లి ప్రశాంత్పై పీడీయాక్టు విధించారు. పోలీసులు వివరాల మేరకు.. శివరాత్రి సంపత్ 2021 మార్చిలో వ్యవసాయభూమి అమ్మి ఎర్టిగా కారు కొనుగోలు చేసి హైదరాబాద్లో అద్దెకు నడుపుతున్నాడు.
అతని జల్సాలకు ఆదాయం సరిపోకపోవడంతో స్వగ్రామం మహ్మదాపూర్కు చెంది న తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. మూడు కార్లల్లో సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పగటి వేళల్లో గ్రామ శివార్లలోని మేకల మందలను గమనించి, రాత్రి సమయాల్లో దొంగిలించి సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని పశువుల సంతల్లో అమ్మేవారు. ఈ ముఠా ఇప్పటివరకు రూ.8 లక్షల మేరకు 150 మేకలను ఎత్తుకెళ్లి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఈనెల 17న చిగురుమామడి పోలీస్ సేష్టన్లో అరెస్టు చేసి వారి నుంచి 11 మేకలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో నలుగురిపై నేరచరిత్ర ఉండడంతో వారిపై పీడీయాక్టు అమలు చేశారు. ఈ మేరకు నిందితులకు కరీంనగర్ జైలర్ సమక్షంలో నిర్బంధ ఉత్తర్వులు అందించి వారిని చెర్లపల్లి కేంద్ర జైలుకు తరలించారు. పీడీయాక్టు అమలులో కీలకపాత్ర పోషించిన తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డి, చిగురుమామిడి ఎస్ఐ సుధాకర్, పీడీ సెల్ ఇన్చార్జి పండరిని సీపీ సత్యనారాయణ అభినందించారు.