కార్పొరేషన్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ సహకారంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మేయర్ అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సంబంధించి 235 అంశాలతో కూడిన ఎజెండాకు బల్దియా పాలకవర్గం ఆమోదం తెలిపింది. పాలకవర్గ సభ్యులు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నగరంలో వరద నీటి సమస్యలు, సీజనల్ వ్యాధులు, కోతులు, పందులు, కుక్కల బెడదపై చర్చించారు. అలాగే, డివిజన్ల వారీగా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీటి సరఫరా, హరితహారంతో పాటు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సమస్యలను సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. నగర ప్రజల ఆరోగ్య రక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, డివిజన్ల వారీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని సభ్యులు సూచించారు.
నగరంలో కుక్కలు, పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. వావిలాలపల్లిలోని పోచమ్మ గుడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని 41వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి, మేయర్ పర్యటించిన సందర్భంలో తక్షణ సాయం అందించాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ కోరారు. ముంపు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇటీవల వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నామినేషన్ పద్ధతిలో నిధులు కేటాయించి పనులు చేయించాలన్నారు. కిసాన్‌నగర్‌లో డెంగీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కార్మికులను నియమించాలని కోరారు.
ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోతులు, కుకలు, పందుల బెడద నుంచి త్వరలోనే ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన డివిజన్లలో కోతులు పట్టే కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. కుకల సంతతి పెరుగకుండా డాగ్బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు. పందులను నగరానికి దూరంగా తరలించాలని యజమానులతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని, వారికి స్థలం కేటాయింపుపై కలెక్టర్‌తో చర్చించామన్నారు. జిల్లా అధికారులు స్థలం కేటాయించగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
సీఎం అస్యూరెన్స్ నిధులు రూ.347 కోట్లలో ఇప్పటికే రూ.200 కోట్ల పనులు పూర్తి చేశామని, మిగతా పనులు సాగుతున్నాయన్నారు. పనులు పూర్తయిన మేరకు బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిషరిస్తామని తెలిపారు. నగరంలోని శివారు డివిజన్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు త్వరలోనే రోజు మంచినీరు అందిస్తామన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.