చొప్పదండి, జూలై 30: గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. మండలంలోని దేశాయ్‌పేటలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుంట రవి మాట్లాడుతూ, గ్రామాల్లో అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది,అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
గంగాధర, జూలై 30: మండలంలోని మల్లాపూర్ అంబేద్కర్ సంఘ భవనంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అంటరానితనం సామాజిక దురాచారమని, గ్రామాల్లో అంటరానితనాన్ని ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. సర్పంచ్ ఆకుల శంకరయ్య, ఆర్ఐ అశోక్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు మ్యాక వినోద్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 30: మండలంలోని కొక్కెరకుంట ఎస్సీ కాలనీలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ఐ రజినీ మాట్లాడుతూ, సమాజంలో అసమానతలు లేకుండా అన్ని వర్గాలవారు కలిసి మెలసి ఉండాలనే ఉద్దేశంతో పౌరహక్కుల దినోత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, పలువురు కాలనీ వాసులు దళితబంధు పథకం అందరికీ అందేలా చూడాలని కోరారు. దీనిపై సర్పంచ్ అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ దళితబంధు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. విడుతల వారీగా అందరికీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, నాయబ్ తహసీల్దార్ ఖాజా కుతుబుద్దీన్, ఎంపీవో సురేందర్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.