కార్పొరేషన్, జూలై 29: ప్రజలు భాగస్వామ్యమైనప్పుడే సీజనల్ వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టగలుగుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర , ఆదివారాల్లో డ్రై డేను పాటించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లెలో శుక్రవారం డ్రై డేను ప్రారంభించి మంత్రి ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. ఇంటి ముందు నీటి తొట్టిల్లో ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్య త అన్నారు. విషజ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్ర, ఆదివారాలను డ్రై డేలుగా పాటించాలని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలో డ్రై డేను విజయవంతం చేసేందుకు ఐదుగురు సభ్యులతో 100 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని, అవసరమైతే నిల్వ ఉన్న నీటిని తొలగిస్తారని ప్రజలందరూ సహకరించాలన్నారు. వీరితో పాటుగా నగరంలో వైద్య బృందాలు సైతం పర్యటించి జ్వర సర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు. విష జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాయని పేరొన్నారు. ప్రజలు విష జ్వరాలతో భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో ప్లే లేట్ మిషన్ అందుబాటులో ఉందని, ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో మందుల కొరత లేదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఎదురొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నా. ప్రజలు రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూతో ఏ ఒక ప్రాణం కూడా పోవద్దనేది తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై.సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ భూమాగౌడ్, బండారి వేణు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.