కార్పొరేషన్, డిసెంబర్ 16: నగరంలోని 44వ డివిజన్ కార్ఖానాగడ్డ ప్రాంతంలోని ఓ పురాతన భవనం గురువారం మధ్యాహ్నం కూలింది. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన రెండంతస్తుల భవనానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారి కుంగిపోయింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లో లేకపోవడం… అందులో పని చేస్తున్న కూలీలు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు పోలీసులతో పాటు కార్పొరేటర్, మేయర్‌కు సమాచారం అందించారు. వెంటనే మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్ని పరిశీలించారు. ఇంటిని బల్దియా సిబ్బందితో తొలగింపజేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 40 ఏళ్ల క్రితం మట్టితో గోడలు నిర్మించడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, భవనం కుంగిపోయి పకనే ఉన్న భవనాలకు ప్రమాదకరంగా మారిందన్నారు. చుట్టూ ఉన్న భవనాలకు ఇబ్బంది కలుగకుండా కట్టర్స్ యంత్రం సహాయంతో తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు. వానకాలంలో నగరపాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇలాంటి శిథిల భవనాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ సిబ్బందితో తొలగించినట్లు పేర్కొన్నారు. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు ఉంటే బల్దియాకు సమాచారం అందించాలని కోరారు. టౌన్ ప్లానింగ్ డీసీపీ సుభాష్, ఏసీపీ భానుచందర్, టీపీబీవో సంధ్య, నవీన్, రాజు, పోలీసులు పాల్గొన్నారు.