KCR Birthday | కేసీఆర్ తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్ధితులను గుర్తు చేసుకుంటే కేసీఆర్ సాహసం, చరిత్ర తెలుస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఓ వైపు టీడీపీ, మరొక వైపు నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ.. మూడు బలమైన రాజకీయ శక్తులను డీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఆనాడు ఉన్నదల్లా ఒక్కటే.. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం.. ఇది మాత్రమే కేసీఆర్‌ను మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. తర్వాత జరిగిన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ పోరాటం తెలుసు, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా ప్రజలకు తెలుసు. తదనంతరం 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలించారన్నారు కేటీఆర్.
ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ చెప్పారు ఢిల్లీలో ‘జనరల్ గా నాయకులు అయితే బెస్ట్ అజిటేటర్స్ (ఉద్యమకారులు) ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ (పరిపాలకులు) ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులు అయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆరే, బెస్ట్ అజిటేటర్ కూడా కేసీఆరే. అది మీ అదృష్టం’ అన్నారు. అట్లా 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన, మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతా ఉన్నారు. నేను వారికందరికీ ఒకటే చెప్తా ఉన్నాతెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు వేసిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందన్నారు కేటీఆర్.
సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుపడి నిలబడ్డోళ్లకు జాతి అంటే ఏంటి..? జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుస్తది..? ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది..? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్‌కు తెలంగాణ సోయి లేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలవదన్నారు.
జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది..
అడుగుతున్నారు కొంతమంది.. కేసీఆర్ ఏ జాతికి నువ్వు జాతి పిత..? ఏ జాతి అని మాట్లాడుతున్నావు..? వాడికి నేను చెప్తా ఉన్నా,ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్న అల్పుడికి, అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది.జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది.కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది.భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని చెప్పిన దాశరథి జాతి మాది.1952లో “గైర్ ముల్కీ గో బ్యాక్” అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది.
69లో కర్కశ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. కానీ వాడికేం తెలుస్తది మన జాతి గురించి… వాడిలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేము కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నెముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం, ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది. బానిసకు ఒక బానిసకు ఒక జాతి కాదు, గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాదని కేటీఆర్ అన్నారు.
“ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రెయిటర్ల జాతి’గుర్తుపెట్టుకో.. కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్ర్యం తెచ్చిండో తమ జాతికి, ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్దమనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్దమనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరోగా ఉంటారు. కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో, అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరిపేస్తామని. కేసీఆర్ జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి..? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసనన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక.
తెలంగాణలో ఇవాళ మరి ఆత్మగౌరవంతో తమ యాసలో, తమ భాషలో బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోయే ఒక అవకాశాన్ని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా… రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేస్తున్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తన్నా. మనందరి లక్ష్యం ఒక్కటే.. కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒక్కటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒక్కటే..
ఐకమత్యంగా కొట్లాడుదాం. ఐకమత్యంగా కలిసికట్టుగా కదం తొక్కుదాం. మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరేయడమే, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక.ఈ సందర్భంగా మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతున్నాను.
“ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని అడిగిన సన్నాసికి చెప్తున్నా..
తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి..
ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి.మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి.
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/H8y03X7veQ
— BRS Party (@BRSparty) February 17, 2026
తెలంగాణ భవన్ లో ఘనంగా గులాబీ దళపతి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @YadavTalasani గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS, మాజీ మంత్రి @BRSHarish, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నాయకులు హాజరై కేక్ కట్… pic.twitter.com/5fjqEv4RIB
— BRS Party (@BRSparty) February 17, 2026