జమ్మికుంట, జూలై 29: ‘ఈటల కన్నతల్లిలాంటి పార్టీని.. తండ్రిలాంటి కేసీఆర్‌ను మోసం చేసిండు. మంత్రిగా పనిచేసినప్పుడే ప్రతిపక్షాలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నడు. నమ్మకద్రోహిగా మారిండు. దళితులు, బడుగు, బలహీన వర్గాల భూములు కబ్జా చేసిండు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తరు. ఓటమి భయంతోనే ‘గజ్వేల్’ పాటపాడుతున్నడు. ఈటలే కాదు.. జేజమ్మ వచ్చి పోటీ చేసినా.. కేసీఆర్‌ను ఓడించలేరు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వం జాగ్రత్త’ అని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు.
అనామకుడైన ఈటలకు టీఆర్ఎస్ టికెట ఇచ్చి గెలిపించిన కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు, కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీలో చేరాడని, తర్వాత బీజేపీని కూడా మోసం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఉప ఎన్నికలో గెలిచాక నియోజకవర్గంలో రూ.లక్ష అభివృద్ధి చేశావా? కనీసం కేంద్రం నుంచి నిధులు తెచ్చావా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం దూసుకుపోతున్నదని, బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గెలిచి తొమ్మిది నెలలైనా ప్రజలకు కనిపించకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు.
భార్యాభర్తల దొంగేడ్పులు.. సానూభూతితో గెలిచారే తప్పా.. ఇప్పుడెలా గెలుస్తారో.. చూస్తామన్నారు. కేంద్రం నిత్యం ధరలు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తున్నదని దుయ్యబట్టారు. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ, రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని చెప్పారు. ప్రతి గింజనూ కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల గుండెల్లో నిలిచిందన్నారు. దేశానికి దిక్సూచీగా నిలిచిన దళిత బంధును అడ్డుకున్న చరిత్ర ఈటలదని, దళిత వ్యతిరేకిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు భిక్షపతి, నరేశ్, రమేశ్, రాము, భాస్కర్, రాజు, రాము, రాజయ్య, నాయకులు శివశంకర్, దిలీప్, అశోక్‌రెడ్డి, రమేశ్, సదానందం, శ్రీహరి, రవీందర్, మాధవరావు తదితరులున్నారు.