హుజూరాబాద్ రూరల్, జూలై 29: నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని ఎన్టీపీసీ రామగుండం మెయింటనెన్స్ జనరల్ మేనేజర్ అలోక్ చంద్ర ఠాకూర్ పేర్కొన్నారు. మండలంలోని కిట్స్‌లో శుక్రవారం బిజిలి, ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ‘ఉజ్వల భారత దేశం-ఉజ్వల భవిష్యత్ పవర్ ఎట్ 2047 కార్యక్రమం’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అలోక్ చంద్ర ఠాకూర్ హాజరై మాట్లాడారు. వాతావరణ కాలుష్యం, బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి సోలార్, పవన విద్యుత్ లాంటివి ఉపయోగించాలని సూచించారు. విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఆదా చేయాలని కోరారు. విద్యార్థులు ఎన్టీపీసీలో విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవచ్చునని చెప్పారు.
కరీంనగర్ ఎస్ఈ గంగాధర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోజులో సుమారు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేది కాదని, ఇప్పుడు నిరంతరంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విద్యుత్ సిబ్బంది నిరాటంకంగా పని చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల అభివృద్ధిలో విద్యుత్ కీలకమని పేర్కొన్నారు. కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ, కళాశాలలో సౌరశక్తి ఉత్పత్తి చేసి తమ అవసరాలకు వినియోగించుకొని, మిగతా కరెంట్‌ను విద్యుత్ శాఖకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఇంటిలో సౌర శక్తితో పని చేసే ఒక చిన్న సాధనం ఉపయోగించి, ఇతరులకు సౌర శక్తితో లాభాలను వివరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రజలకు విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై అవగాహన కలిగించడానికి వివిధ సంక్షిప్త చలనచిత్రాలను ప్రదర్శించారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ప్రేమ్‌రెడ్డి, సోమ్ల భూక్యా, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు సిబ్బంది, కిట్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.