విద్యానగర్, జూలై 29: వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపు నీటిలో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా చూడాలని ఆదేశించారు. మురుగు నీటి గుంతలు, డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. గర్భిణులు, మహిళలకు రక్త పరీక్షలు చేయించి, రక్తహీనతను గుర్తించాలని వైద్యాధికారులను ఆదేశించారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్ మాత్రలు ఇచ్చి, పర్యవేక్షించాలని సూచించారు. ఏ షీల్డ్ యాప్ డౌన్ లోడ్ చేయించి, మొబైల్ యాప్ ద్వారా తమకు తామే పర్యవేక్షించే విధంగా చూడాలన్నారు. ఇంటింటా సర్వే చేసి అర్హులందరికీ బూస్టర్ డోస్ వేయాలని, ప్రతి ఏఎన్ఎం కనీసం 25 మందికి డోసు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.