ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో కొత్తగా టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం, దీనికి నీటి తరలింపుపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రామడుగు మండలం రాంచంద్రాపురం శివారులోని వరద కాల్వ నుంచి పత్తిపాక వరకు గ్రావిటీ కాల్వ ద్వారా ఫేస్-1, ఫేస్-2 ద్వారా పనులు చేపట్టి నీటిని తరలించాలని అధికారులు నిర్ణయించారు.
అయితే, రాంచంద్రాపురం వరద కాల్వకు అనుబంధంగా మోతె ఓటీ -1 కాల్వను చొప్పదండి మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వ వరకు 10 కిలో మీటర్ల మేర నిర్మించేందుకు ఇప్పటికే అంతా సిద్ధం కాగా, దీనిని అధికారులు ఫేస్-1గా పేర్కొన్నారు. దానికి అనుబంధంగా ఫేస్-2లో పెద్దకుర్మపల్లి శివారు నుంచి పత్తిపాకలో కొత్తగా నిర్మించనున్న రిజర్వాయర్ వరకు రూ.37.50 కోట్లతో 7.1 కిలోమీటర్లు కొత్తగా గ్రావిటీ కాల్వ నిర్మించాలని అధికారులు తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
పత్తిపాక శివారులో ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.103 కోట్లు, దీనికి అనుబంధంగా గ్రామాలకు సాగునీటి సరఫరా కోసం 15 కిలో మీటర్ల మేర కాల్వ నిర్మాణానికి రూ.89.50 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం నిర్మాణ వ్యయం రూ.230 కోట్లు అవుతుందని అంచనా వేశారు. వరదకాలువ నుంచి రిజర్వాయర్ వరకు 3000 ఎకరాలు, రిజర్వాయర్ ద్వారా 7000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని సంకల్పించారు.
ఈ క్రమంలో గురువారం కరీంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈశ్వర్ నీటి పారుదల శాఖ ఈఈ కిరణ్, ఇతర అధికారులు, ప్యాక్స్ చైర్మన్ ముతాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అధికారులు రూపొందించిన కొత్త రిజర్వాయర్, కాల్వల నిర్మాణం, అలైన్మెంట్ మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. ఆ ప్రతిపాదనలను నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.
సాగు నీటికి పరిష్కారం
పత్తిపాక శివారులో రిజర్వాయర్‌ను నిర్మించాలన్న కల త్వరలో నెరవేరనున్నది. ఇప్పటికే ఇక్కడ జలాశయం నిర్మాణం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తానికి సాగునీటిని అందించాలని నీటి పారుదల శాఖ అధికారులు అలైన్‌మెంట్‌ను మార్చారు. కొత్త మార్గం వరద కాల్వ ద్వారా నీటిని తరలించాలని సంకల్పించాం. కొత్తగా కాల్వలతోపాటు రిజర్వాయర్, దానికి అనుబంధంగా కాల్వలు నిర్మించి కొత్త ఆయకట్టుకు నీరిచ్చి రైతుల కళ్లల్లో ఆనందం నింపాలన్నది నా ఆకాంక్ష. అందుకు తొలి అడుగు పూర్తి చేశాం.
-రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్