పెద్దపల్లి, జూలై 28 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: ‘నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే దుష్ప్రచారం చేస్తున్నరు. రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ఉద్యోగాల నియామకాల్లో నా ప్రమేయం ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నరు. నేను గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తేల్చిచెప్పారు. ఓ పేదబిడ్డ ఎమ్మెల్యేగా ఉండడం కొందరికి రుచించడంలేదని, అందుకే నిందలు వేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఒక సామాన్యుడు ఎమ్మెల్యే కావడమే ఇక్కడ పాపమై పోయిందని, తన గెలుపును సోమారపు కుటుంబం జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నానని, ఇది నచ్చకనే బురదజల్లుతున్నదని దుయ్యబట్టారు. తనపై చులకనగా మాట్లాడుతూ ప్రజల్లో పలుచన చేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ తన హయాంలో చేసిన అభివృద్ధి గురించి కాకుండా, రాజకీయ పబ్బం గడుపు కోవడానికి మీడియాను, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తన రాజకీయ జీవితంలో ఏదైనా తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేసే దమ్మూ ధైర్యం ఉండాలన్నారు. సత్యనారాయణ కోడలు లావణ్య ఆర్ఎఫ్సీఎల్ నియామకాల్లో తన ప్రమేయం ఉందంటూ ఫేస్బుక్లో తప్పుడు పోస్టులు పెడుతున్నదని ధ్వజమెత్తారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పేరిట మోసం ఆరోపణలపై 18 మంది ప్రజాప్రతినిధులతో కమిటీ వేస్తున్నానని తెలిపారు. ఆ కమిటీ క్షుణ్ణంగా విచారించి తనకు నివేదిస్తారని చెప్పారు.
ఇందులో ఎవరికి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠిన చర్యలకు వెనుకాడబోమన్నారు. రామగుండం ప్రాంత ప్రజలకు ఒక అన్నలా, తమ్ముడిలా, కొడుకులా సేవలందిస్తున్నానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు పార్టీ వారైనా బంధుమిత్రులైన ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసే వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డా. బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, ఇంజపురి పులేంధర్ తదితరులు ఉన్నారు.