విద్యానగర్, జూలై 28: వర్షాలు, వరదలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా పేదల సంక్షేమం బహుళ పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నో అవాంతరాలు ఎదురైనా కొనసాగిస్తున్నారని కొనియాడారు.
కరీంనగర్‌ను ఆరోగ్యవంతమై నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అందుకోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానను మంత్రి గంగుల గురువారం సందర్శించారు. వార్డుల్లో కలియతిరుగుతూ రోగులను పరామర్శిస్తూ వారిలో ధైర్యం నింపారు. వైద్య సేవలను అడిగి తెలుసుకుంటూనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్లడ్ బ్యాంకుకు వెళ్లి ప్లేట్లెట్ మిషన్ పనితీరును పరిశీలించారు. క్యాంటీన్‌ను పరిశీలించి, పలువురికి భోజనాన్ని వడ్డించారు.
ఆ తర్వాత జడ్పీ సమావేశ మందిరంలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 222 మందికి 2.20 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. 5.54 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను మేయర్ సునీల్‌రావుతో కలిసి నగరపాలక సంస్థ ఆవరణలో ఆయన ప్రారంభించారు. అంతకుముందు కరీంనగర్ దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, విషజ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉన్నామని, మందులకు కొరత లేదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వచ్చే రోగులను నిర్వాహకులు భయాందోళనకు గురి చేయవద్దన్నారు. రోగుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు పంపించాలని, డెంగ్యూ పరీక్షలను సర్కారు దవాఖానలో మాత్రమే చేస్తారని తెలిపారు.
ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే డెంగ్యూను నిర్ధారిస్తారని, ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడా ఎలిసా టెస్ట్ లేదన్నారు. కరీంనగర్ జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లాలో ప్రస్తుతం 6 కొవిడ్ కేసులున్నాయని, అందులో ముగ్గురు సర్కారు దవాఖానలో, ముగ్గురు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఇప్పటివరకు మలేరియా కేసులు నమోదు కాలేదని, 13 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా తేలిందని, 22 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, వీరు ప్రభుత్వ దవాఖానలో కోలుకుంటున్నారని వివరించారు. జ్వరం వస్తే ప్లేట్లెట్లు తగ్గడం సాధారణమేనని, తగ్గినంత మాత్రాన ప్రజలు భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్లేట్లెట్ మిషిన్ అందుబాటులో ఉందని తెలిపారు.
జిల్లాలో విషజ్వరాలు అదుపులో ఉన్నాయని, ఏ చిన్న జ్వరం వచ్చినా ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు. జ్వర పీడితుల కోసం ప్రత్యేకంగా 100 పడకల వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, డీఎంఅండ్‌హెచ్‌వో జువేరియా, ఆర్ఎంవో జ్యోతి, వైద్యులు నవీన, పద్మ, అలీమ్, నర్సింగ్ సూపరింటెండెంట్లు అంజమ్మ, సులోచన, విజయలక్ష్మి, సరళ, జూనియర్ అనలిస్టు తుమ్మల రవీందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, సిబ్బంది భీంరావు, రమణ,భాస్కర్, ఫార్మసీ సూపర్వైజర్ శివకుమార్, భారతి, ఆకుల ప్రభాకర్, వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, దిండిగాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నియంత్రణకు చర్యలు
సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్ , డెంగ్యూ నియంత్రణకు చర్యలు చేపట్టాం. డెంగ్యూను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోనే రక్త పరీక్ష చేసి నిర్ధారిస్తారు. వ్యాధుల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో వైద్య సిబ్బంది బృందంగా ఏర్పడి డెంగ్యూ వ్యాధి వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న ఇంటి వరకు పరీక్షలు నిర్వహిస్తున్నది. యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నారు.
– కరీంనగర్ దవాఖానలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్