తెలంగాణచౌక్, డిసెంబర్ 16: అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేశ్ బాబు సూచించారు. నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవనంలో గురువారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ కార్డు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ లేబర్ కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ-శ్రమ్ కార్డు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్డు తీసుకున్న ప్రతి కార్మికుడికి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. 16 నుంచి 59 ఏళ్ల వయసు కార్మికులు అర్హులన్నారు. ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతాతో సీఎస్సీలో కార్మికులు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ అధికారులు నజీర్అహ్మద్, శ్రీకాంత్, సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, కార్మిక సంఘం నాయకులు బుచ్చన్న, అశోక్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, డిసెంబర్ 16: మండలంలోని మధురానగర్‌లో ఈ-శ్రమ్ కార్డు కోసం అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధిహామీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, ఆశ కార్యకర్తల వివరాలను గురువారం సర్పంచ్ వేముల లావణ్య ఆధ్వర్యంలో నమోదు చేశారు. కురిక్యాల సర్పంచ్ మేచినేని నవీన్‌రావు, నాయకులు వేముల అంజి, అలువాల తిరుపతి, పెరుక శ్రావణ్, దోమకొండ మల్లయ్య, మ్యాక వినోద్, సీఎస్ఈ నిర్వాహకుడు దోర్నాల బాపురెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.