కలెక్టరేట్, జూలై 28: పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదలకు పెద్దన్నలా మారాడని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఆయన కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన 222 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 20 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా ఉంటున్నారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, ఓర్వలేని కొన్ని పార్టీల నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఇలాంటి పథకాలు దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సంక్షేమంపై నోరు మెదపడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం పేద, బలహీన వర్గాల సంక్షేమానికి అనుగుణంగా ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ను ఆడబిడ్డలు దీవించి, వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి గంగుల కమలాకర్ నడుచుకుంటూ, జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, జంగిలి ఐలెందర్ యాదవ్, సుధగోని మాధవి, గుగ్గిల్ల జయశ్రీ, గందె మాధవి, టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
దేవుడిలా ఆదుకున్నరు
మా కుటుంబమంతా కేసీఆర్ సారునే దేవుడిగా కొలుస్తున్నం. నా కూతురు పెండ్లి చేయడానికి అప్పు కోసం మొక్కని దేవుడు లేడు, తిరుగని ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్షా నూట పదహార్లు ఇచ్చి, దేవుడిలా ఆదుకున్నరు. ఈ పైసలు పెండ్లికి చేసిన అప్పు కడుత. కేసీఆర్ సారుకు మా కుటుంబ సభ్యులమంతా రుణపడి ఉంటం.
-చింత కవిత, దినసరి కూలీ, 9వ డివిజన్, కోతిరాంపూర్
అండగా ఉంటం
కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నం. నా కూతురు పెండ్లికి నాలుగు రూపాయల మిత్తికి కూడా అప్పు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పుడు లక్షా నూటపదహార్లు ఇచ్చి ఆదుకున్నరు. అందుకే మా ఇంటి దర్వాజపై కేసీఆర్ సారు ఫొటో పెట్టుకున్నం.కేసీఆర్ సారుకు, మంత్రి కమలాకరన్నకు అండగా ఉంటం.
-మేరుగు పుష్పలత, దినసరి కూలీ, చింతకుంట
డబ్బులు లేక ఇబ్బందులు పడ్డం
నా కూతురు పెండ్లి చేయడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు కేసీఆర్ సారు రూ.లక్షా నూటపదహార్లు ఇచ్చి నా బిడ్డకు మేనమామలా మారాడు. మాలాంటి పేదలు బాగుపడాలంటే ఎల్లకాలం కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన చేసిన మేలు మేమెన్నడూ మరువం. మా కుటుంబమంతా రుణపడి ఉంటం.
-పాతర్ల రాధ, వ్యవసాయ కూలీ, మొగ్దుంపూర్