కార్పొరేషన్, జూలై 28: కరీంనగర్‌లోని చౌరస్తాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే నగరంలోని కోర్టు, బస్టాండ్, కమాన్ చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దగా, మిగితా చౌరస్తాలను కూడా అత్యంత సుందరంగా తయారు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నగరంలోకి స్వాగతం పలికే చౌరస్తాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు సమాలోచనలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రైవేట్ కన్సల్టెన్సీ సహకారంతో ఆయా చౌరస్తాలు మరింత ఆకర్షణీయంగా కనిపించే విధంగా డిజైన్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సుందరీకరణ పనుల కోసం రూ. 6.50 కోట్లను కేటాయించి 13 చౌరస్తాలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే పలు చౌరస్తాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కాగా, మరిన్ని చౌరస్తాలకు సంబంధించిన డిజైన్లను తుది రూపు ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారు.
అత్యంత ఆకర్షణీయంగా చౌరస్తాలు
నగరంలో ప్రస్తుతం ఉన్న చౌరస్తాలతో పాటు మరిన్ని చౌరస్తాలను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీ నిధులతో 22 చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 13 చౌరస్తాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా అల్గునూర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, బొమ్మకల్ చౌరస్తా, రేకుర్తి ఏరియాల్లో నగరంలోకి స్వాగతం పలికే చౌరస్తాలను మరింతగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు డిజైన్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని తెలంగాణ చౌక్, తెలంగాణ తల్లి చౌరస్తా, బొమ్మకల్ చౌరస్తాల డిజైన్లు తుది రూపునకు రాగా.. కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే రోడ్డులో మహాభారతం, పద్మనగర్ చౌరస్తాలో గరుడ పక్షిని పోలిన విధంగా చౌరస్తాలను సుందరీకరణ చేయాలని బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు
నగరంలో చేపడుతున్న చౌరస్తాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిజైన్ల పూర్తి కాగానే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు బల్దియా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు చౌరస్తాల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కావడంతో అతి త్వరలోనే ఈ పనులను ప్రారంభించి వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి సుందరీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు.