పూజలు, ప్రత్యేక ఆరాధనలతో శోభాయమానంగా వెలుగులీనే కాలమిది.. ఏ గుడి చూసినా, ఏ ఇల్లు చూసినా ఆధ్యాత్మికత వెదజల్లే మాసమిది.. నోములు, వ్రతాలు, పండుగలు, పబ్బాలకు నెలవైన శ్రావణం నేటి నుంచే మొదలు కానున్నది. నెలంతా శుభప్రదమే కాగా, జిల్లా అంతటా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకోనున్నది. నోములు, వ్రతాలే కాదు, చెట్ల తీర్థాలు, వనభోజనాలతో అంతటా సందడి నెలకొననున్నది.
– కమాన్చౌరస్తా, జూలై 28
శ్రావణ మాసంలో ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతాయి. పూజలు, పునస్కారాలతో మహిళలు బిజీగా గడుపుతారు. శ్రీమహావిష్ణువు, ఆయన సతీమణి లక్ష్మీదేవికి ప్రత్యేక వ్రతాలు చేస్తారు. చాంద్రమాసం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈ నెల పౌర్ణమిన చంద్రుడు శ్రావణ నక్షత్రం సమీపంలో సంచరిస్తున్నందున ‘శ్రావణ మాసం’గా పిలుస్తారు. అదీగాక శ్రావణ నక్షత్రం, శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో విష్ణు పూజలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవని భావిస్తారు. మంగళవారాల్లో గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణు పూజలు చేస్తారు. శుక్లపక్షంలో 15రోజులను పరమపవ్రితమనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్ర్తాలు ప్రవచిస్తున్నాయి.
పండుగలివే..
2న నాగుల పంచమి
5న వరలక్ష్మీ వ్రతం
12న రాఖీ పౌర్ణమి
19న శ్రీకృష్ణాష్టమి
27న పొలాల అమావాస్య
31న వినాయక చవితి
మంగళగౌరీ వ్రతం : కొత్తగా పెళ్లయిన యువతులు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజా మందిరంలో తూర్పు ముఖంగా మండపం ఏర్పాటు చేసి మంగళగౌరీని పూజిస్తారు.
వరలక్ష్మీ వ్రతం : ఆగస్టు 5న ఆచరించే అతి ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. కొబ్బరికాయకు పసుపు పూసి అమ్మవారి ఆకారానికి పూజలు చేస్తారు.
మహాలింగార్చన : సోమవారం సాయంత్రం ప్రదోష కాలపూజ సందర్భంగా మహాలింగార్చన ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొదటి, రెండు, మూడు, నాలుగో సోమవారాల్లో, శ్రీ భీమేశ్వరాలయంలో మహాలింగార్చన జరుగుతుంది.
శాస్త్రీయత : శ్రావణ వచ్చే సమయంలో నేలంతా చిత్తడిగా మారుతుంది. భారీ వర్షాలు పడే అవకాశముంటుంది. ఈ సమయంలో నీరు కలుషితమవుతుంది. డయేరియా, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నది. ఆధ్యాత్మికత పేరిట పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, శాఖాహారం భుజించడంలాంటి నియమాలు పాటించడం వల్ల ఇంటిల్లిపాదీ ఆయురారోగ్యాలతో ఉండవచ్చు.
ప్రవిత్ర మాసం శ్రావణం..
తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రవిత్రమైనది. ఈ నెలలో శివ, కేశవ భేదం లేకుండా భగవంతుడిని ఆరాధిస్తే సకల కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ నెలలో లక్ష్మీదేవితో పాటు, అమ్మవారి ఆరాధన చాలా శ్రేష్ఠం. వివాహాలు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు, కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజులు.
– మంగళంపల్లి శ్రీనివాసశర్మ, ప్రముఖ పండితులు
సర్వశుభాలు కలుగుతాయి
శ్రావణ మాసం శుభకార్యాలయాలకు మంచిది. అందరికీ సర్వశుభాలు కలుగుతాయి. ఈ మాసంలో ప్రతిసోమవారం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ అద్దాలమండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
– అప్పాల భీమాశంకర్, వేములవాడ ఆలయ స్థానాచార్యులు